Welcome to the BLISSFUL journey

శివరాత్రి కథ

0

ఈ మాస శివరాత్రికి పురాణాల నుంచి సంగ్రహించబడిన ప్రసిద్ధ కథ…

ఒకప్పుడు వారనాసి అనే నగరంలో ఒక పేద వేటగాడు ఉండేవాడు.అతడి పేరు “సుస్వర”. అతడు ప్రతి రోజు వేటకు వెళ్లి , జంతువులను వేటాడి దొరికిన వాటితో కుటుంబాన్ని పోషించుకునే వాడు.ఒకరోజు ఎక్కువ జంతువులను వేటాడాలనుకొని ,దట్టమైన అడవిలోకి వెళతాడు.జంతువుల వేటకోసం అడవిలో తిరుగుతూ తిరుగుతూ తొందర్లోనే సూర్యా స్తమయం జరిగి,చీకటి పడుతుంది.సుస్వర ఇంటికి వెళ్లాలి అనుకుంటాడు కానీ ,ఇంటికి తిరిగి వెళ్లే మార్గమును తెలుసుకోలేకపోతాడు.ఆ రాత్రి అడవిలో ఉండే క్రూర మృగముల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అతడి వాసనను పసిగట్టిన క్రూర మృగములు అక్కడకు చేరి, ఆ చెట్టు క్రిందనే సంచరిస్తూ ఉంటాయి.క్రూర మృగములు అక్కడే పొంచి ఉండడం వలన ఆ రాత్రంతా రెప్ప వేయకుండా జాగరణ చేస్తాడు సుస్వర. అనాలోచితంగా ఆ చెట్టు ఆకులను త్రుంచి నేల మీద జారవిడుస్తాడు.అది పవిత్రమైన బిల్వ చెట్టు.ఆ చెట్టు అడుగున శివలింగం ఉందని కూడా సుస్వరకు తెలియదు.అయినప్పటికీ పవిత్రమైన బిల్వ పత్రాలను క్రిందకు జార విడువడం ద్వారా శివలింగానికి  పూజను సమర్పించాడు. ఆ రాత్రి శివరాత్రి కాబట్టి వేటగాడు తెలియకుండానే రాత్రి జాగరణ చేసి శివునికి పూజను సమర్పించాడు. అతడు దేహాన్ని విడిచిన తరువాత అతని ఆత్మ భగవంతునిలో ఐక్యమైందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కథ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

పై కథ ఒక ఉపమానం. వేటగాడు ఏ విధంగా అయితే క్రూర జంతువులను వధించడానికి ప్రయత్నించాడో ఆధ్యాత్మిక అన్వేషకుడు కూడా కామము , క్రోధము , మోహము , అసూయ మరియు ద్వేషాలను అధిగమించడానికి ప్రయత్నించాలి.  ఈ ప్రతికూల భావాలన్నీ మనస్సు అనే అడవిలో సంచరిస్తుంటాయి. ఆధ్యాత్మిక ఆకాంక్ష కలిగినవారు ముక్తి పొందడానికి ఈ జంతువులను (ప్రతికూల భావాలు) వధించవలసి ఉంటుంది.
వేటగాని యొక్క పేరు “సుస్వర “దీని అర్థం ” మధురమైన స్వరం “అంటే స్వచ్ఛమైన మనస్సు, వాక్కును తెలియజేస్తుంది.
వేటగాడు వారనాసిలో జన్మించాడు. “వర” అనగా  “నుదుటి భాగం” ను సూచిస్తుంది. ” నాసి” అనగా ” ముక్కు” అని అర్థం – రెండూ కలిసే బిందువు వారనాసి. మరో విధంగా చూసినట్లయితే కనుబొమ్మల మధ్య బిందువు”ఆజ్ఞాచక్రము” అని కూడా అంటారు. ఆజ్ఞా చక్రాన్ని మూడు నాడుల కూడలిగా పరిగణిస్తారు. అవే ఇడా, పింగళ ,సుషుమ్న . ఒక ఆధ్యాత్మిక సాధకుడు లేదా సాధకురాలు వారి దృష్టిని ఈ బిందువు పై నిలిపి ఉంచినప్పుడు, వారు ఏకాగ్రతను మరియు వారి ఇంద్రియాలపై క్రమంగా నియంత్రణను సాధించగలుగుతారు.
జంతువులను వధించడం అనేది ఒకరి వాసనల పై నియంత్రణను సూచిస్తుంది ( అంతర్గర్బితమైన ప్రవృత్తి )  .
బిల్వచెట్టు వెన్నెముకకు సూచన ప్రాయంగా ఉంటుంది. ఈ చెట్టు ఆకులు ప్రత్యేకమైనవి. ప్రతి ఆకు త్రిదళాలను లేదా మూడు చిన్న పత్రములను కలిగి ఉంటుంది. ఈ త్రి దళాలు పైన చెప్పిన మూడు నాడులను సూచిస్తాయి.
జాగ్రృతతో ( మెలకువగా) ఉండడం అనేది ఒక ఆధ్యాత్మిక సాధకుడు లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఎరుక మరియు ఏకత్వానికి ప్రతీక.ఆధ్యాత్మిక సాధకుడు ఒక్క క్షణం కూడా జాగరూకతతో లేకుండా ఉండలేడు.
మెలుకువ(జాగృద) ,స్వప్న ,గాఢ నిద్ర (సుషుప్తి) అనే మూడు స్థితులను ప్రకాశింపజేసే పరమ చైతన్యమే శివుడు.త్రి దళాలు కలిగిన బిల్వ పత్రాలను శివలింగానికి సమర్పించడం వలన ఈ మూడు స్థితులను దాటి నాలుగవ చైతన్య స్థితి అయిన “తురీయ” అవస్థను చేరుకుంటారు అని తెలియజేస్తుంది. తురీయ అవస్థను చేరుకోవడం అనేది వ్యక్తి యొక్క జాగరూకత అనుగుణంగా ఉంటుంది.

Share.

Comments are closed.