Welcome to the BLISSFUL journey

Day 37 – అమ్మగారి మౌన స్థితి

0

అమ్మగారి మౌన స్థితిని గురించి శిష్యులంతా చాలా సేపు చర్చించుకున్నాం. అమ్మగారు ఏమీ తినకుండా ఉన్నారని మాలో కొందరు ఏమీ తినకుండా ఉండిపోయారు. మరికొందరు అమ్మగారు సమాధి స్థితిలో ఉన్నారని, అమ్మగారి ఏకాంతానికి భంగం కలుగ చేయకూడదని అనుకున్నారు. మరి కొందరికి పరిస్థితి ఏమిటో తెలియక విశ్రమించారు. మరు నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి అక్కడ ధ్యానం చేశాం. అమ్మగారితో పాటుగా గంగోత్రి ఆలయానికి ప్రయాణమయ్యాం. మేమున్న ప్రదేశం నుండి చాలా ఎత్తులో ఉంది గంగోత్రి ఆలయం. దారి అంతా ఎత్తైన పర్వతాలు, లోయలు.

ఆలయంలోకి అమ్మగారు ముందు నడుస్తుంటే వెనుక మౌనంగా అమ్మగారిని అనుసరించాం. తొలుత గంగమ్మ విగ్రహాన్ని దర్శించి ముకుళిత హస్తాలతో గంగమ్మకు ప్రణతులు సమర్పించారు అమ్మగారు. ఒక పక్క గంగమ్మ చల్లని దృక్కులు, మరోపక్క అమ్మగారి విలక్షణ వీక్షణాలు. అక్కడ నుంచి అదే స్థితిలో గుడికి ఎడుమ వైపున ఉన్న, కొండ కింద పాలరాతి నేలపై శిష్యులతో సహా ఆసీనులయ్యారు అమ్మగారు.
అక్కడ అందరం వృత్తాకారంలో కూర్చున్నాం. మాలో కొందరు అమ్మగారిని తదేకంగా చూస్తుంటే అమ్మగారి నిశ్చల స్థితి శూన్యంలో దేనినో అన్వేషిస్తున్నట్లు అనిపించింది. వెన్నెల కురిసే అమ్మగారి నేత్రాల నుండి తీక్షణత. అమ్మగారి నేత్రాల నుండి ప్రసరిస్తోన్న  శక్తి ప్రకంపనలు మేము అనుభూతి చెందాము. అమ్మగారితో పాటు గంగోత్రి వద్ద ధ్యానం ప్రారంభించాం. ధ్యానంలో కాసేపు ఉన్నాక మాకందరికీ  బయట నుండి ఒకలాంటి వేడి మా వెనుపాము భాగమంతా ప్రసరించినట్లు అనిపించింది. ఈ అనుభవం శిష్యులందరికీ కలిగింది. అక్కడి నుండి వెంటనే లేచి చాలా వేగంగా కారులో కూర్చుండిపోయారు అమ్మగారు.అమ్మగారి వేగాన్ని  మేమెవ్వరం అందుకోలేక పోయాం. అమ్మగారు మన అమ్మగారేనా అన్న కించిత్ అనుమానం మాలో ఆవహించింది.

Share.
Leave A Reply