అమ్మగారు, ఆ రాళ్లను గురించి చెప్తూ అవి మీ కుటుంబంలో ఎవ్వరికి ఇవ్వకూడదు. అవి ప్రత్యేకంగా మీకోసమే అందించబడిన రాళ్లు. మీలో ఎప్పుడైనా అహంకారం, ఈర్ష్య, ద్వేషం వంటివి లేవనెత్తినపుడు వాటితో భ్రూ మధ్యంలో3 సార్లు కొట్టుకోండి అని చెప్పారు. ఇంత అద్భుతమైన ప్రక్రియ జరిగాక కూడా మరల మీరు యథా స్థితికి రాకుండా ఉండేందుకు ఆ రాళ్లను అందించినట్లు చెప్పారు.
ఇంతలో యశి తన అనుభవం చెప్పింది. “అమ్మా, మీరు మౌనంగా ఉన్నారు. నేను కారులో మీతో ప్రయాణం చేస్తున్నప్పుడు నా హృదయం లోపల చాలా ఆనందం కలుగుతోంది. 15 నిమిషాల పాటు లోపల పొంగుతున్న ఆనందం కారణంగా నవ్వుకుంటూ ఉన్నాను” అని చెప్పింది. తనకు కలిగిన అనుభవం గురువు పట్ల సత్ భావన వల్లేనని చెప్పారు అమ్మగారు.
“గురువుతో మనం ప్రయాణిస్తున్నప్పుడు, గురువు సాంగత్యం వల్ల పొందే దివ్యానుభూతిని మనం వెంట తీసుకువెళ్లాలి. మా గురువుల ద్వారా మాకు కలిగే దివ్యానుభూతి మాలో నిక్షిప్తమై ఉంటుంది. గురువుల ద్వారా మనకు కలిగే స్పందనలు ఎప్పటికి సజీవంగా ఉండిపోవాలి. భావ తరంగాలు, స్పందనలు ఎక్కువైనప్పుడే మనం మానవుడి స్థితి నుండి దేవుడి స్థితికి చేరగలం. ఆ భావ తరంగాలు ఈ విశ్వంలో ఆత్మ కలసిపోయేందుకు దోహదం చేస్తాయి.” అని చెప్పారు అమ్మగారు.