“పరమ గురువులు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి శిష్యులందరితో పాటు సూక్ష్మ రూపంతో గౌరీ శంకర్ పీఠం చేరాను. అందుకే ఆ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావద్దని చెప్పాను” అన్నారు అమ్మగారు. అందరం ఆశ్చర్యంగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకుంటూ విన సాగాo……
హిమాలయ పర్వతాల్లో కొలువైన పరమ పవిత్ర ఆశ్రమం గౌరి శంకర్ పీఠం. ఇది పరమ గురువులైన శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి ఆశ్రమం. కొన్ని వేల సంవత్సరాలుగా సశరీరంతో ఉంటూ, ఎందరో మహా యోగులకు, సిద్ధ పురుషులకు, అవధూతలకు, మహర్షులకు, సాధనాసక్తులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దిశా నిర్దేశం చేస్తూ, ఈ అఖండ భూమండలంపై అంధకారం ప్రబలి, మానవాళి పూర్తిగా అజ్ఞానంలో కొట్టుమిట్టాడకుండా, మనుషులను రక్షిస్తోన్న అవతార పురుషులు, దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారు. దుఃఖంలో మునిగి, ఏ దిక్కు లేకుండా అలమటించే మనుషుల పట్ల కరుణార్ద్రతతో ఆపన్న హస్తం అందించే పితృ సమానులు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు. మహావతార్ బాబాజీ గారు సుషుమ్న క్రియా యోగుల పరమ గురువులు. మన అమ్మగారికి ప్రత్యక్ష గురువులు.