మరిన్ని విషయాలు చెబుతూ, “అలాగే మౌనం అంటే ఆంతరంగిక మౌనం అని అర్ధం. ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడు గురువు ద్వారా లభించే శక్తిని మీరు 100 % పొందగలుగుతారు. మీరంతా గురువుల అనుగ్రహాన్ని, శక్తిని పూర్తిగా పొందాలన్నదే నా తపన. సాధకులు ఆంతరంగిక మౌనంలో ఉన్నప్పుడు గురువు మాట్లాడకుండానే గురువు స్థితిని గ్రహించగలుగుతారు శిష్యులు. అలాగేమౌనం ద్వారానే గురువు అందించే సందేశాలను కూడా స్వీకరించగలుగుతారు” అన్నారు అమ్మగారు.
“ఉత్తర కాశీలో శివాలయానికి వెళ్ళినప్పుడు, శివుడి నుండి విపరీతమైన రౌద్రం నాలో నిండి పోయింది. అది ఉత్తర కాశీ అంతా విస్తరించింది. శివ తాండవం చేస్తుంటే ఎంతటి శక్తి ప్రకంపనలు ఉంటాయో అంతటి శక్తి నాలో నిండిపోయింది. మహా శివుడు నా లోపల తాండవం చేస్తున్న భావన. ఆ తరువాత మనం హర్శిల్ వెళ్ళాం. ఆ ప్రదేశం గురించి మీకు సందేశం పంపిన తరువాత, నేను కాటేజీ లోపల కిటికీ నుండి బయటకి చూస్తున్నాను.అప్పుడు సకల దేవతా గణం ఒక ప్రవాహంలాగా కదులుతూ వెళ్లిపోతున్నారు. ఆఖర్లో మహావతార్ బాబాజీ గారు, వారి 49 శిష్యులు కనిపించారు. ఆ సమయంలో బాబాజీ గారు నన్ను గౌరి శంకర్ పీఠానికి రమ్మన్నారు.