అమ్మగారు నవ్వుతూ అందరిని పలకరిస్తున్నారు.అందరం లోపలికి వెళ్లి అమ్మగారి సమక్షంలో కూర్చున్నాక అమ్మగారు చెప్పిన ఆ నాటి విశేషాలు జన్మ జన్మా0తరాలు వరకు గుర్తు ఉండిపోతాయి.
జ్ఞానమైనా, బుద్ధి వికాసమైన అది గురుకృప వల్లే కదా సాధ్యం!. అమ్మగారు చెబితే కానీ హిమాలయ యాత్ర ఆధ్యాత్మిక పరమార్థం, దాని అంతరార్థం మాకు తెలియలేదు.
అమ్మగారు మేము గంగోత్రికి బయలుదేరే రోజు మౌనంగా ఉండమన్నారు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండాలని చాలా సేపు నిశ్శబ్దంగా ఉన్నాం. దారిలో భోజనం కోసం ఆగినప్పుడు పులిహార తింటూ, ఆ రుచిని ఆస్వాదించాం. మౌనానికి అసలు నిర్వచనమిచ్చారు అమ్మగారు ఆనాడు.
అమ్మగారు యోగి అంటే ఎలా ఉండాలో చెప్తూ” ఒక యోగి అన్నప్పుడు దేన్నైనా తట్టుకోగల స్థితి మనకు ఉండాలి. ఆత్మతో సమాగమమైన స్థితే యోగ స్థితి. మరి ఆ స్థితి కోసం పరితపించే యోగి ఎల్లప్పుడూ సమ స్థితిలోనే ఉండాలి. మనం బయట ప్రాంతాలకు వచ్చినప్పుడు సరైన ఆహారం దొరక్క పోవచ్చు, ఆహార సమయంలో మార్పులు రావచ్చు, ఒక యోగి అన్నిటికి తట్టుకొని ఉండాలి” అన్నారు.
“ఇదే విషయాన్నీ నేను మీకు తెలియ చెప్పాలని నేను అన్న పానీయాలు ముట్టలేదు. ఏదైనా సరే నేను చెప్పే ముందు నేను చేసి చూపాలి కదా! అందుకే అలా చేశాను” అన్నారు. ఇది విన్న మాకెవ్వరికి నోట మాట రాలేదు.