అమ్మగారు ఉత్తర కాశీలోని శివాలయం నుండి బయటకు వస్తున్నప్పుడు చాలా గంభీరంగా కనిపించారు. ఉత్తర కాశీలో అమ్మగారి స్థితిని అర్థం చేసుకున్న కొందరు చాలా నిశ్శబ్దంగా మారిపోయారు. కొంత ప్రయాణం సాగాక, పర్వతాల చాటుగా ఉన్న గంగమ్మ దర్శనమిచ్చింది. గంగమ్మ నదీ ప్రవాహ వైభవం, ఆది శంకర భగవద్ పాదులవారు అమ్మవారి పాపిట సింధూరాన్ని వర్ణించినంత అందంగా కనిపిస్తోంది. “పరీవాహ శ్రోత: సరణివ సీమంత సరణి ” అంటారు ఆది శంకరులు. అంటే రెండు కొండల మధ్య నుండి సాగే సుందర నదీ ప్రవాహంలా ఉంటుందిట అమ్మవారి పాపిడి. సరిగ్గా అదే పోలికలో అదే దృశ్యం మాకు కనిపించింది. రెండు కొండల మధ్య నుండి పవిత్ర ధారలా సాగుతూ కనిపించింది ఒక చోట గంగమ్మ. భరత భూమిని తన తోయములతో పావనం చేసిన గంగ, పరమ శివుడి సిగ నుండి దూకిన గంగ, అరచేత తీర్థమై లభించే గంగ, జలపాతమై, మహా ప్రవాహమై గలగల మంటూ కదులుతుంటే, ఉత్తుంగ తరంగమై ఎగసిపడుతుంటే, మెలికలు కదలికలతో నాట్యమాడుతుంటే, మహనీయుల పాద స్పర్శతో పునీతమై, ఆనంద లహరిలా సాగిపోతుంటే, చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు.