సూర్యనాడి పింగళనాడి అని, చంద్రనాడి ఇడానాడి అని యోగ శాస్త్రం చెబుతుంది. సూర్యనాడికి ప్రతీకగా యమునా నది, చంద్రనాడికి ప్రతీకగా గంగా నదిని కూడా చెబుతుంది శాస్త్రం. హిమాలయ పర్వత సీమలలో పుట్టి ప్రవహించే ఈ నదులు, సంగమించే ప్రదేశమే ప్రయాగ.ఈ రెండు నదుల మధ్య అంతర్వాహినిగా ప్రవహించే నది సరస్వతి. సరస్వతీ నది అగ్నినాడి అయిన సుషుమ్ననాడికి ప్రతీక. ఈ మూడు నదుల కలయిక, మూడు నాడుల కలయిక ను సూచిస్తుంది. గంగా, యమునా సరస్వతీ నదుల సంగమమే, త్రివేణి సంగమం. అందుకే అక్కడ స్నానం చేసినప్పుడు దుష్కర్మల క్షయంకరి అయిన యమున, మోక్ష ప్రదాయిని అయిన గంగ, సుధాసారాభి వర్షిణి అయిన సరస్వతీ నదుల అనుగ్రహాన్ని పొందుతారు. ఎంతో మహిమాన్వితమైన నదుల కలయిక జరిగే పవిత్ర ప్రయాగలో కుంభమేళా సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారు ఆదేశించిన 49 రోజుల అధ్బుతమైన ప్రక్రియను, సుషుమ్నక్రియా యోగులంతా పరిపూర్ణ భావంతో నిర్వహించినపుడు ఆ నదీ జలాల్లో స్నానం చేసిన పరమాద్భుత పుణ్యం లభిస్తుంది.