మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి వెంట వెంటనే తయారై కాలి నడకనే మా రూమ్ దగ్గర నుండి ఆడిటోరియం చేరాం. ఉదయం 6:00 గంటలకు ఒక సెషన్ తిరిగి 7:00 గంటలకు మరొక సెషన్ కలిపిరెండు సెషన్లు ఏర్పాటు చేశారు. ఎంతో శ్రద్ధగా అక్కడి వారంతా అమ్మగారి వద్ద దీక్షను పొంది, ధ్యానానికి సంభందించిన అనేక ప్రశ్నలు వేశారు. DRDO ఉద్యోగులు, శాస్త్రవేత్తలు దీక్షా శిబిరానికి హాజరయ్యారు.సుషుమ్న క్రియా యోగ వైశిష్ట్యం, దీక్ష, సుషుమ్న క్రియా యోగంలోని శాస్త్రీయ విజ్ఞానం ఈ మూడు కార్యక్రమాలతో రెండు సెషన్లు ముగిసాయి. కార్యక్రమం ముగిసాక అమ్మగారు రూమ్ వరకునడుస్తానన్నారు. అమ్మగారికి నడక అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ప్రకృతి శోభ నిండి ఉన్న ప్రదేశాలంటే చాలా ఇష్టపడతారు. అమ్మగారి వెనుకనే కొందరం ఉన్నాం. అమ్మగారు అక్కడి పర్వత సౌందర్యాన్నితదేకంగా చూస్తూ..నెమ్మదిగా నడుస్తున్నారు. మేము నడుస్తున్న మార్గం మధ్యలో చిన్న చిన్న పూ బాలలు అనేక రంగుల్లో కనిపించాయి. అమ్మగారు ప్రతీ పువ్వును తిలకిస్తూ మురిసిపోతున్నారు. ఆచిన్న చిన్న పూల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ముగ్ధులవుతూ….. ఒక పుష్పాన్ని పసి పాపాయిని ముద్దాడుతున్నట్లుగా పట్టుకుని ఆనందంగా నవ్వుతూ నడిచారు. వెనకనే వస్తోన్న మా మదిలో మెదిలినభావన. ఈ రోజు ఆ పువ్వు ఎంత అదృష్టం చేసుకుందో….! అమ్మగారి కర స్పర్శతో దాని జీవితం ధన్యం అయింది! అనిపించింది. ఆ రోజుకు ధ్యాన కార్యక్రమాలు ముగిసాయి. అమ్మగారు అందరినివిశ్రమించమన్నారు. మధ్యాహ్నం వేళ కాస్త విశ్రాంతి తీసుకొని 4 గంటల ప్రాంతంలో మరొక చోటికి బయలు దేరాం.