‘హిమాలయాలు’. యావత్ భూమండలానికి శక్తిని ప్రసరించే శక్తి కేంద్రాలే ఈ హిమవత్ పర్వతాలు. పరమ శివుడి శిష్య పరంపర దగ్గర నుంచి ఎందరో మహా యోగులకు ఆవాసంగా, వారి తపో కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి ఈ పర్వత సీమలు. భారతీయ యోగ విద్యా రహస్యాలను యుగ యుగాలుగా సంరక్షిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా రహస్య గుహల్లో జరిగే అనేకానేక యోగిక విద్యలకు నెలవుగా భాసిల్లుతున్నాయి హిమాలయాలు. ఆ తుహిన గిరుల సౌందర్యాన్ని గురించి విన్నా, చదివినా అక్కడికి వెళ్లాలన్న ఆకాంక్ష భక్తి తత్పరులకు, సాధకులకు కలుగుతుంది. ఇక మానవ జాతి సముద్ధరణకు ప్రభవించిన ‘క్రియా యోగ’ విద్యను కూడా హిమాలయ పర్వత శ్రేణుల్లోనే పరమ శివుడు, పార్వతీ దేవికి, సప్త ఋషులకు ఉపదేశించారు. ఆధునిక యుగంలో, క్రియా యోగం తొలిసారి లాహిరి మహాశయుల వారికి అందించబడింది హిమాలయాల్లోనే. వేగవంతమైన జీవిత ప్రయాణంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న మానవాళి కోసం సుషుమ్న క్రియా యోగ విజ్ఞానాన్ని, హిమాలయాల నుంచి జనారణ్యాలకు చేరవేసిన సిద్ధ గురువులు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు. భరతభూమి ఆర్జించిన ఆధ్యాత్మిక సంపదకు ఘన ప్రతీకలుగా నిలుస్తాయి హిమాలయాలు. మానవ దేహంలో నిష్టాగరిష్ఠమైన యోగ సాధన ద్వారా వజ్ర కఠోరంగా మారిన వెన్నుముకలా నిటారుగా నిలిచి ఉంటాయి ఆ గిరులు.
ఆత్మ సాధనే నిరంతర అగ్ని హోత్రంగా, భగవద్ సాయుజ్యమే తమ జీవన గమ్యంగా చేసుకొని 12 సంవత్సరాల పాటు దీక్షతో సాధన చేసి, సుషుమ్న క్రియా యోగ గురుస్థానాన్ని అధిరోహించిన పూజ్యులు, నడిచే దైవం ఆత్మానందమయి అమ్మగారు. వేదాల్లోని సారాన్ని తమ మృదు మధురమైన పలుకుల ద్వారా, ఆధ్యాత్మిక వాఙ్మయాన్ని సుషుమ్న క్రియా యోగ విజ్ఞానం ద్వారా అందిస్తోన్న మాహా తపస్విని మా గురువులైన ఆత్మానందమయి అమ్మగారు. అంతటి మహా తప: సంపన్నురాలైన మా గురువు గారు చాలా నిరాడంబరంగా జీవించటాన్ని ఇష్టపడతారు. మృదు స్వభావం, కరుణాంతరాగం, మధుర హృదయం, సామాన్యులను సైతం అక్కున చేరుకునే మంచితనం వారి దివ్య గుణ విశేషణాలు. అమ్మగారి సాంగత్యంలో పరమాత్మ ప్రేమను సాధకులందరం చవిచూశాం. అమ్మగారు ప్రేమానందభరితమైన వారి చూపును మనపై ప్రసరిస్తే చాలు, పాషాణం వంటి హృదయమైనా మంచులా కరిగిపోవాల్సిందే. అహంకారంతో, అజ్ఞానంతో మసక బారి, సత్యాన్ని, విశ్వ ప్రేమను తెలుసుకోలేని మా వంటి ఎందరినో సుషుమ్న క్రియా యోగ దివ్య విద్య ద్వారా జ్ఞాన మార్గంలో పెట్టారు మా గురువుగారు. మాటలతో కంటే తమ మౌనంతోనే అంతరాంతరాళల్లో పరివర్తన తీసుకురాగలిగిన జ్ఞాన స్వరూపులు ఆత్మానందమయి అమ్మగారు. అందరు సాధకుల్లాగే సుషుమ్న క్రియా యోగ సాధకులైన మాకు కూడా హిమాలయాలకు వెళ్లాలన్నది చిరకాల కోరిక. ‘ఒక యోగి ఆత్మ కథ’, ‘హిమాలయ పరమ గురువులతో జీవనం’ వంటి గ్రంథాలు చదివిన ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడ మహా యోగుల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.
2016 లో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారితో పాటు హిమాలయ యాత్రకు వెళ్లేందుకు యువ శిష్య బృందానికి, మరి కొందరు సాధకులకు అవకాశం లభించింది. అమ్మగారితో హిమాలయ యాత్ర వివరాలు రేపటి భాగంలో….