రామచంద్ర గారు శ్రీ షిరిడీ బాబా గారిని నా జీవిత ధ్యేయ మేమిటో చూపించండి – అని చేసిన ప్రార్థనకు జవాబుగా శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారి ముఖతః సుషుమ్న క్రియా యోగము అభ్యసించగలిగారు …అమ్మగారు అరటిపళ్లు తీసుకురా ! అన్న ఆదేశము విని ,తీసుకు వెళితే డబ్బులు ఇస్తారా? ఇవ్వరా?! అని ఆలోచించే స్థితి నించి….అమ్మగారి తో ఎన్నో జన్మల ధ్యానానుబంధమున్నది – ఆమె గురు దేవత అని – ధ్యానము,అమ్మగారు – రెండూ తలంపులతో మమైక్యం చెంది ,ఆ తాదాత్మ్యతలో అమ్మగారిని తలుచుకుంటే చాలు ఎనర్జీని అనుభవించగలిగే స్థితికి వచ్చారు రామచంద్ర గారు.
ప్రతి ధ్యాని ధ్యానము చెయ్యటముతో పాటు ,వారి వారి బాధ్యతలు కూడా చక్కగా నిర్వహించాలని ,అందరిలో ఉన్న మంచిని స్వీకరించాలని ,ధ్యానులందరూ ప్రేమ తత్వముతో ఉండాలని ,ఆత్మానందాన్ని అనుభవించాలని శ్రీ శ్రీ శ్రీ ఆత్మా నందమయి అమ్మగారి ఉపదేశాన్ని సంపూర్ణముగా స్వీకరించి ,ఆచరించిన శిష్యులలో రామచంద్ర గారు ఒకరు.
“రామచంద్రా! ధ్యానము రోజూ చెయ్యి అసలు ఈ ధ్యానములో ఏముందో తెలుసుకో!” అన్న అమ్మగారి మాటలు పాటించిన రామచంద్ర గారికి అత్యద్భుతమైన అనుభవాలు కలిగాయి.ఒక పౌర్ణమినాడు ,ధ్యానం చేసి ,ప్రకృతిని పరిశీలిస్తూ వుండగా ఒక విచిత్రానుభవము కలిగింది.ప్రతి చెట్టు, పుట్ట,వస్తువు – వాటన్నింటికీ మరొక ప్రతి రూపము కాంతితో కనిపించడము ప్రారంభ మైనది ,బిల్డింగ్ లు ,ఎలక్ట్రిక్ పోల్స్ అన్నింటికీ ఇలా ప్రతి రూపము కనిపిస్తే ,ఇది నా భ్రమా? నిజమా? అని అడిగితే అమ్మగారు ” ఈ భూమి పై ఉన్న ప్రతి జీవికి ,అలాగే ప్రతి వస్తువులకూ ఎనర్జీ బాడీ అనేది ఉంటుంది.అదే నువ్వు చూడగలిగావు…ఇంకా ధ్యానములో ముందుకు వెళ్ళినపుడు “ఆరా” లను కూడా చూడగలుగుతావు” – అని సెలవిచ్చారు.ధ్యానమంటే ఇంకా పరిపూర్ణ విశ్వాసం ఏర్పడింది రామచంద్ర గారికి.
మరి కొన్ని రోజులు ధ్యాన సాధన తరవాత ధ్యానంలో ఒక మహర్షి గారు దర్శనమిచ్చారు.”తన ముందే కాషాయ వస్త్రాలతో నడిచి వెళ్లిన ఆ మహర్షి గారు భృగు మహర్షి గారని ,వారు కనిపించి రామచంద్ర గారికి ఎనర్జీ ఇచ్చి వెళ్లారు” – అని అమ్మగారు చెప్పినప్పుడు ” ధ్యాన సాధన చేస్తే ఋషులు,యోగులు,మునులు ,భగవత్ స్వరూపాలను – అందర్నీ దర్శించవచ్చు అన్న మాట” అని అర్థమైంది రామ చంద్ర గారికి.
ఒకరోజు అత్యంత ఇష్టమైన ప్రేమ స్వరూపులు ,తనను నమ్మిన వారి కోసము తన శరీరాన్ని కూడా పణంగా పెట్టి వారిని రక్షించిన మహనీయుడు. ఒక నూతన శకానికి నాంది పలికిన యుగ పురుషుడు అయిన ఒక గొప్ప మహోన్నతమైన ప్రేమ స్వరూపాన్ని నేను దర్శించాలి – అని వారం రోజుల పాటు ధ్యానము చేశారు రామచంద్ర గారు.
ఒక సాయం సంధ్యా సమయంలో ఒక మహనీయులు కనిపించి కొన్ని విషయాలు చెబుతూంటే కాగితం మీద రాసుకున్నారు రామచంద్రగారు ఆయన “దాహం..దాహం..నీరు తీసుకురా! మళ్లీ వాళ్లు వచ్చేస్తారు…”అన్నప్పుడు పరుగున వెళ్లి నీటి కొలనులో దోసిలి పట్టగానే ధ్యానం నుంచి బైటకు వచ్చేశారు.రాసుకున్నవి ఏవీ గుర్తు లేవు ..నేను దర్శనం కోరుకున్న వ్యక్తి ,నాకు ధ్యానంలో దర్శనమిచ్చిన వ్యక్తి ఒక్క రేనా?! అన్న సందేహము కలిగింది రామచంద్రగారికి ఎందుకంటే ధ్యానంలో దర్శనమిచ్చిన వ్యక్తి చాలా పురాతన ముగా కనిపించారు.తను దర్శనము ఇవ్వాలి అనుకున్నది ఇ ప్పటి కాలపు ప్రజలు మహనీయ స్వరూపంగా ఆరాధించే మహాత్ముణ్ణి.ఒకవేళ సందేహ నివృత్తికి అమ్మగారిని అడిగితే ” నువ్వు చూడాలనుకున్న వ్యక్తిని దర్షించావులే” – అంటారేమో…నాకు నిదర్శనము కావాలి – అనుకున్నారు రామచంద్రగారు యాదృచ్ఛికంగా స్నేహితుడి ఫోటో స్టూడియోకి వెళితే,అక్కడికి యోగదా సత్సంగపు వ్యక్తి వచ్చారు.వారి వద్ద కొన్ని మహావతార్ బాబాజీ , లాహీరీ మహాశయులు ,యోగానంద గారి ఫొటోస్ ఉన్నాయి ..వాటితో పాటు ఆశ్చర్యంగా రామచంద్రగారికి స్వప్నంలో దర్శనము ఇచ్చిన మహాత్ముని ఫోటో కూడా ఉన్నది.వారు ఎవరు? అని ప్రశ్నించిన రామచంద్రగారికి వారి సమాధానము విని ఆనందానికి అవధులు లేకపోయాయి.ఆ వ్యక్తి జీసస్ క్రైస్ట్ వారు తనకు దర్శనమివ్వడమే కాక ,వారితో తను మాట్లాడగలిగారు.మరుసటి రోజు అమ్మగారి దర్శనానికి వెళ్ళగానే”రామచంద్రా! నీకు నిదర్శనము దొరికిందా? నీ డౌట్ తీరిపోయిందా?! అని అడిగారు అమ్మగారు.
అమ్మగారు సర్వజ్ఞులు ,సాక్షాత్ భగవత్ స్వరూపులు అనిపించింది శ్రీ రామచంద్రగారికి ,ధ్యానం అనేది కేవలము ఒక మతానికి చెందింది కాదు అన్ని మతాల వారు కూడా ధ్యానం చెయ్యవచ్చును …విశ్వాత్మకు అవధులు లేవు – అని అర్థమైంది.
ధ్యానము చెయ్యకముందు పుట్టలు పుట్టలుగా వచ్చే ఆలోచనలు – ధ్యానము కొన్ని రోజుల సాధన తరవాత ,4 లేక 5 ఆలోచనలు వస్తాయి – ఆలోచనలు ఎంత తగ్గితే అంత విషవశక్తిని ఎక్కువగా గ్రహించగలుగుతాము – ధ్యానానికి రాకముందు చాలా బలహీనంగా ,నెగటివ్ ఆలోచనలతో ఉండే రామచంద్రగారు ధ్యాన సాధన వలన ఉదాసీనత పోయి పూర్తి పాజిటివ్ థింకర్ అయ్యారు.వ్యాధి నిరోధక శక్తి పెరిగింది అని తనను తాను విచారణలో తెలుసుకున్నారు రామచంద్రగారు.శరీరము ,మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంచే ధ్యాన ప్రక్రియ ఇది.తన చుట్టూ నిరంతరము జ్వలిస్తూ తిరిగే గోల్డెన్ రింగ్స్ కాస్మిక్ ఎనర్జీ అని అమ్మగారు చెప్తే అర్థమైంది ఆయనకు.విపరీతమైన ఎనర్జీ ఫ్లో తట్టుకుని ,తరవాత ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక నిరాడంబర సాధువు దర్శనమిచ్చి ” నీవు సత్యనారాయణ వ్రతము బాకీ పడ్డావు ” – అనగానే “మీరు ఎవరు ప్రభూ?!” అని అడిగితే “శుక్రుడు”అన్న సమాధానానికి అవా అవాక్కయి వారు శుక్ర గ్రహాధిపతి శుక్రులా?లేక రాక్షస గురువు శుక్రాచార్యులా అన్న సందేహానికి “శుక్ర గ్రహాధిపతి శుక్రులు” అని అమ్మగారు సమాధానము చెప్పారు.” నువ్వు ఒక జన్మలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని ప్రగాఢంగానే భావించావు కానీ ఆ వ్రతము చెయ్యకుండా మరణించావు.అన్నవరము వెళ్లి ఆ మొక్కు పూర్తి చేసుకో! అంతే కాదు – ఎనర్జీ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యానము చేస్తే పరమ గురువులు ,భగవంతుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది – లేదా వారి సందేశాన్ని మనకు తెలియ జేయడము జరుగుతుంది – అని ఆదేశమిచ్చారు అమ్మగారు.
రామచంద్రగారికి సంప్రాప్తించిన ఈ అనుభవాలన్నీ దైవాంశ సంభూతులు, వారి ఆత్మాభివృద్ధికి ఎంతగానో శ్రమించి , ఎనర్జీ ఇచ్చి , సన్మార్గంలో వెన్నంటి వుండి నిరంతర మార్గనిర్దేశము చేస్తున్న పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి అనుగ్రహమే అంటారు వారు.
సుషుమ్న క్రియా యోగులు…పూర్వ జన్మ సంస్కారాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి నుంచి ధ్యానము ప్రారంభించి ,అమ్మగారు,పరమగురువుల అనుగ్రహంతో అనేక స్థాయిలకు అతి త్వరగా పురోగతి పొందడము మనము గ్రహించడానికి రామచంద్రగారి అనుభవాలు మరొక ఉదాహరణ.