గంగోత్రి నుంచి నేరుగా హరిద్వార్ చేరాం. హరిద్వార్ వెళ్లేసరికి చీకటి పడిపోయింది. అక్కడికి చేరిన తరువాత మాలో కొందరం మరునాడు ఉదయాన్నే తిరుగు ప్రయాణం చెయ్యాలి కనుక, ఆ రోజు రాత్రే గంగా స్నానం చేద్దామని బయలుదేరాం. అక్కడ గంగానదిలో మునకలు వేసి, నీటిలో తేలుతూ కాస్త లోతు తక్కువున్న ప్రాంతంలో ధ్యానం చేసాం. మాకు ఎదురుగా శక్తి క్షేత్రమైన మానస దేవి ఆలయం ఉంది. ఆ ఆలయానికి అభిముఖంగా కూర్చొని ధ్యానం చేస్తుంటే అద్భుతమైన శక్తి ప్రవాహం అనిపించింది. గంగా స్నానం చేసి, రూములకు వెళ్లిన మాకు ఆ రాత్రి అమ్మగారి దర్శన భాగ్యం కలుగలేదు. ఒక పక్క పవిత్ర హిమాలయ యాత్రకు వచ్చామని ఉన్నా, అమ్మగారి మౌనం వల్ల మాలో ఎవ్వరికి ఉత్సాహం లేదు. మరు నాడు బయలుదేరిపోవాలి.
తిరుగు ప్రయాణం చేసేనాటి రోజు వచ్చేసింది. ఇక ఆ రోజు మేమంతా తిరిగి వెళ్లిపోవాలి. ఆ రోజు ఉదయం మానస దేవి మందిరానికి వెళ్ళాం.రోప్ వే ద్వారా ఆ ఆలయంలోనికి వెళ్ళాం. ఆలయం లోపల ధ్యానం చేసి హోటల్‌కు చేరాం. సరిగ్గా అప్పుడు కబురు అందింది అమ్మగారు అందరిని రమ్మంటున్నారు అని.