మా రిసార్టుకు, గంగోత్రి ఆలయం నుండి నేరుగా వెళ్ళాం.ఒక అరగంటలో అల్పాహారం స్వీకరించి సిద్ధంగా ఉన్నాం. అమ్మగారు అరగంట సేపు ఎవ్వరికీ కనపడలేదు. “అమ్మగారు లోపలికి ఎవ్వరిని రావద్దన్నారు” అన్నారు ప్రశాంతమ్మ.అక్కడి నుండి ముందు రోజు మాకు రాళ్లు ఇచ్చిన చోటికి చేరాం. మరల చాలా వేగంగా నడుస్తూ గంగానదిలోకి దిగి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆ నీరు ఎంత చల్లగా ఉన్నాయంటే, డీప్ ఫ్రీజర్లోని ఐస్ నీళ్లలా ఉన్నాయి. అమ్మగారు చాలా సేపు నీటిలో నించొని ఎదురుగా ఉన్న కొండల వైపుగా పైకి చూస్తూ నమస్కారం చేస్తున్నారు. భౌతికమైన నేత్రాలతో చూస్తున్న మాకు ఏమీ కనపడటం లేదు. కానీ ఎవరో మహనీయులు, పైన ఉండి ఉంటారని తలచి మేమూ నమస్కారం చేశాం. అక్కడి నుంచి తిరిగి బస చేసిన ప్రదేశానికి వెళ్లిపోయాం. అమ్మగారు ఇంకా మౌనం వీడలేదు. ఈ లోగా మేము వెంట తెచ్చుకున్న మా సామానంతా సర్దుకొని అక్కడి నుండి హరిద్వార్ బయలుదేరేందుకు సిద్ధమాయ్యాo.