Welcome to the BLISSFUL journey

Day 35 – వేగంగా ప్రవహిస్తున్న గంగలో నుండి దివ్య శిలలు వెలికి తీసిన అమ్మగారు

0
అమ్మగారు ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చి, చాలా వేగంగా నడుస్తూ, ఎదురుగా ఉన్న గంగలోకి దిగారు. అమ్మగారు ఎం చేస్తున్నారో అర్థమయ్యే లోపే, ఆ ప్రవాహంలో నుండి ఒక్కొక్క రాయిని తీసి శిష్యులకు ఇస్తున్నారు. అమ్మగారికి ఆ క్షణం చాలా సమీపంలో ఉన్న మాలో కొందరికి ఎంతటి విస్మయం కలిగిందంటే! ఆ ప్రవాహం లోతు ఏమిటో తెలియదు.ఆ చలిలో ఏమాత్రం తొణకకుండా అమ్మగారు చాలా సులువుగా గంగలోనికి వెళ్లారు. ఆ ప్రదేశంలో గంగమ్మ వేగంగా ప్రవహిస్తోంది.లోపల ఏముందో మాలో ఎవ్వరికీ కనపడలేదు. ఆ ప్రవాహపు నీరు స్వచ్ఛoగా ఉన్నాయి. అమ్మగారు ఆ చల్లని నీటిలో నిలబడి, లోపలి నుండి రక రకాల ఆకృతుల్లో ఉన్న రాళ్లను తీస్తూ మా చేతికి అందించారు.  అందరం చక చకా  అమ్మగారి వద్దకు వెళ్లి అమ్మగారు మాకిచ్చిన రాళ్లను స్వీకరించాం. అమ్మగారు ఆ ప్రవాహంలో దాదాపు 10 నిమిషాల పాటు ఉన్నారు. అక్కడ చాలా చలిగా ఉంది. ఆ రాళ్లు కూడా అమ్మగారు బయటకు తీసి అందిస్తున్నప్పుడు చాలా చల్లగా అనిపించాయి. అంత శీతలంగా ఉన్న నీటిలో అంత సేపు అమ్మగారు ఉండగలగటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రోజు అందరం కూడా అమ్మగారిని వేరొక స్థితిలో, అమ్మగారిలోని వేరొక పార్శ్వాన్ని దర్శించాం. ఆ ప్రక్రియ పూర్తి చేసి చాలా వేగంగా అమ్మగారు అక్కడి నుండి కదిలారు. ఆ రోజు సుషుమ్న క్రియా యోగులందరూ అమ్మగారి వేగాన్ని అందుకునేందుకు చేసిన ప్రయత్నం ఇప్పటికీ నా మనో ఫలకం పై సజీవంగా ఉంది. అక్కడి నుండి అమ్మగారు తిరిగి కాటేజికి వెళ్లారు. అమ్మగారు ఆ నాడు పచ్చి గంగ కూడా ముట్టలేదు. వారు మాకెవ్వరికీ అర్ధం కాని అనిర్వచనీయ, అలౌకిక స్థితిలో మౌనంగా లోపలే ఉండిపోయారు.
Share.
Leave A Reply