అమ్మగారికి మంచి నీరు అందించటం కోసం అప్పటికప్పుడు మినరల్ వాటర్ కొని ఇచ్చాము. అంత మంది శిష్యులు అమ్మగారి వెంట వెళ్ళాం, ఒక్కరమైనా చేతిలో బాటిల్ పట్టుకొని ఉంటే బాగుండేదనిపించింది. అమ్మగారి సామాను మ్యూల్ పై ఎక్కిస్తున్నపుడే నాకు ఒక స్ఫురణ కలిగింది… అమ్మగారి సామాను చేతిలో పట్టుకోవాలి అని. కానీ ఎందుకో యథాలాపంగా అమ్మగారి సామాను కూడా ఎక్కించేసాం.
ఈ సంఘటనకు సంబంధించి హిమాలయ యాత్ర పూర్తయ్యాక కలిగిన అనుభవం:
ఒక నాడు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తున్నపుడు యమునోత్రికి మేమంతా అమ్మగారితో పైకి ఎక్కుతున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తోంది. అప్పుడు హఠాత్తుగా అమ్మగారు ఎదో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో నాకు ఒక ధ్వని వినపడింది. “సాక్షాత్తు భగవంతుడే, అమ్మగారికి అనుక్షణం ఆనందాన్ని అందిస్తుంటే..శిష్యులైన మీరు ఇంకెంత ఆనందింప చెయ్యాలి..:? “అని వినపడింది. ఆ నాడు అర్థమైంది గురువుతో యాత్ర అంటే, అదేదో పిక్నిక్ వంటిది కాదు అని. గురువుతో యాత్ర చేసేందుకు అర్హత సాధించటమే కాదు, ఆ మహదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చాలా జాగరూకతతో ఉండాలి అనిపించింది. శ్రీ రామ చంద్రుడు అరణ్యవాసం సమయంలో, అన్నయ్యను గురువుగా భావించిన లక్ష్మణులవారు కంటి రెప్ప కూడా వెయ్యకుండా స్వామిని సంరక్షించారట. గురువు పట్ల శిష్యులంతా అదే భావన కలిగి ఉండాలి అనిపించిందానాడు.