Welcome to the BLISSFUL journey

Day 25 – అమ్మగారికి, సమయానికి మంచి నీరు అందించలేకపోయాం

0
ఆధ్యాత్మికంగా, యోగ పరంగా పరమోన్నత వైశిష్ట్యం కలిగిన యమునోత్రికి బయలుదేరాం. యమునా నది పుట్టిన ప్రదేశానికి వెళ్లాలంటే ఎత్తైన పర్వతం ఎక్కాలి. ఆ పర్వతం ఎక్కేందుకు పట్టు కోసం కర్రలిచ్చారు. ఆ ప్రదేశంలో ఒక్కోసారి వర్షం కూడా కురుస్తుందిట. అందుకే కింద ‘రేన్ కోట్లు’ అమ్ముతున్నారు. కొందరం ముందు జాగ్రత్తగా అవి కూడా తీసుకున్నాం.మాతో తెచ్చుకున్న సామాగ్రిని మ్యూల్ (కంచర గాడిద) పైకి ఎక్కించి నడక మొదలెట్టాం. అమ్మగారి కోసం తెచ్చిన బ్యాగులను కూడా వాటి పై ఎక్కించి బయలుదేరాం. అమ్మగారు నడక దారినే వస్తానని అనటంతో అందరూ నడక ప్రారంభించారు. కర్రల సహాయంతో ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్నాం. మధ్య మధ్యలో అమ్మగారితో, అమ్మగారి సోదరి అయిన ప్రశాంతమ్మ గారితో యువ బృందమంతా ధ్యాన అనుభవాలను చెప్తూ ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక అక్కడ చుట్టూ నల్లటి కొండలు కనిపించాయి.  అక్కడి గిరుల్లో దేవతా స్వరూపాలు గోచరమవుతున్నాయి. ఆగిరులని, ఝరులను, తరులను చూస్తుంటే, గిరీశుడైన ఆ మహేశుడి సృష్టి ఎంతటి అద్భుతమైనదో అనిపించింది. భూలోక సౌందర్యమే ఇంత అందంగా ఉంటే, ఇక యోగ సాధన వల్ల ప్రాప్తించే ఉన్నత లోకాల సౌందర్యం ఇంకెంత శోభాయమానంగా ఉంటుందోనని అనిపించింది. నల్లటి ఆ కొండల మధ్యలో గుహలు కూడా దర్శనమిచ్చాయి. ఇటు వంటి గుహలే హిమాలయ యోగులకు ఆవాసాలు కాబోలు అనుకొని ముందుకు సాగాo. కాస్త నడిచాక దూరంగా ఒక మంచు కొండ కనపడింది. ఆవెండి కొండను చూస్తుంటే హృదయం కూడా కరగి యమునా నదియై ప్రవహించింది.  మార్గo మధ్యలో ఒక చోట సేద తీరేందుకు ఆగాo. అమ్మగారు వేడి పానీయమే స్వీకరిస్తారు. అమ్మగారి కోసం తెచ్చిన వేడి నీటిబాటిల్, ఇతర సామాగ్రిని మ్యూల్స్ పైకి ఎక్కించాం. అయితే మ్యూల్తో మాతో పాటువస్తోన్న వ్యక్తి చాలా ముందుకు వెళ్లిపోయే సరికి అమ్మగారికి సమయానికి నీరు అందించలేకపోయాం.
Share.
Leave A Reply