ధ్యానం జరిగిన ప్రదేశం నుంచి, కాలి బాటన ప్రయాణం ప్రారంభించాం. మా హృదయాంతరాళ్లలో పొంగుతున్న అనిర్వచనీయమైన ఆనందానికి ప్రతీకగా, అక్కడ ప్రతీ ఆకులో, ప్రతీ పువ్వులో, మట్టి వాసనలో, అణువణువులో వ్యాపించిన పరమాత్మ ఉనికిని ఆస్వాదిస్తూ ముందుకు సాగాo. ప్రకృతి సొబగులు మమ్మల్ని పరమానందభరితులను చేశాయి. దూరం నుండి చూస్తే మా టెంట్లు, ఆశ్రమoలోని కుటీరాల్లా కనిపిస్తున్నాయి. అమ్మగారు కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, అందరం ఆమ్మగారితో పాటుగా భోజనానికి వెళ్ళాం. అమ్మగారితో కలసి ఆ రోజు రాత్రి భోజనం చేశాo. భోజనానంతరం సత్ సంగం కోసం అమ్మగారు పిలిస్తే,చుట్టూ గుమిగూడాం. అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధనాలు చెబుతున్నారు అమ్మగారు.జన సంచారం లేని నిర్మానుష్య ప్రదేశం అది. చల్లగా వీస్తోన్న హిమవత్ పర్వతాల వీచికలు హిమాలయ యోగుల రహస్యాలను మాతో గుస గుస లాడుతున్నట్లు అనిపిస్తోంది. ఆ మలయ మారుతాలు మోసుకొచ్చిన దివ్య హిమాలయ పుష్పాల సురభిళాలు అంతటా వ్యాపించాయి. రణగొణ ధ్వనులే వినిపించని హాయి గొలిపే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో పక్షుల కిలకిలల్లా వినపడుతున్న మా పకపకలు. యువ బృందం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, కోటి పున్నమి వెలుగులు చిందించే నవ్వులు చిందిస్తున్న అమ్మగారితో చాలా అద్భుతంగా జరిగింది సత్ సంగం. ఇంతలో అదాటున వర్షం మొదలైంది…