Welcome to the BLISSFUL journey

Day 11 – గురువు పంచే జ్ఞాన మకరందం

0

ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అమ్మగారు, DRDO ముస్సోరీ డైరెక్టర్ శ్రీ శంకర్ కిశోర్ గారి గృహానికి వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు మాతో పాటుగా బయలుదేరారు. అమ్మగారి వెంట కొందరు మహిళా సుషుమ్న క్రియా యోగులు, అమ్మగారి సోదరి ప్రశాంతమ్మ కారులో వెళ్లారు. యువ బృందం వెనుక నడక దారిలో బయలుదేరింది. మాకు ఏర్పాటు చేసిన రూముల కంటే మరింత ఎత్తులో ఉంది వారి నివాస స్థలం. చడీ చప్పుడు లేకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడింది వారి గృహం. రెండు అంతస్థుల విల్లా లాగ ఉంది వారి బంగ్లా. లోపలికి  వెళ్ళగానే అందరికీ  తాగడానికి వేడి వేడి నీరు ఇచ్చారు. అది చలి ప్రాంతం అయినందు వల్ల అతిథులకు వేడి నీళ్లు ఇస్తారట. అది అక్కడి సంప్రదాయం. శంకర్ కిశోర్ గారితో చాలా విషయాలు చర్చించిన అమ్మగారు, బయట లాన్ లోకి వచ్చారు. అక్కడ చాలా అందంగా అమర్చిన పూల కుండీలు, మొక్కలు, పూల చుట్టూ మకరందాన్ని ఆస్వాదిస్తున్న భ్రమరాలు కనిపించాయి. ఆ క్షణం ఒక కథ జ్ఞప్తికి వచ్చింది. ఒక తామర కొలనులో తామరాకుల పై కొన్ని కప్పలు మాట్లాడుకుంటూ..తామర పువ్వుకు చాలా దగ్గరగా ఉన్నామని మురిసిపోతున్నాయట, కానీ దూరం నుండి వచ్చిన భ్రమరాలు మాత్రం మకరందాన్ని గ్రహించి వెళిపోయాయట. సాధకులు కూడా సాధనా పథంలో ఆ భ్రమరాలలాగ చురుకుగా ఉంటూ తామర పువ్వు వంటి గురువు సాంగత్యంతో మాత్రమే మురిసిపోకుండా సాధనాపథంలో ముందుకు వెళ్లి, మకరందం వంటి జ్ఞానాన్ని సముపార్జించాలని గుర్తుకు వచ్చింది. శిష్యులు జ్ఞానవంతులైనప్పుడే జ్ఞాన గురువులకు సైతం ఆనందం కలుగుతుంది అనిపించి, ఆ కథ జ్ఞప్తికి రావటంతో కొంత స్ఫూర్తి కలిగింది. అమ్మగారు లాన్లో ఉన్న ఉయ్యాలపై ఆసీనులయ్యారు. మేమంతా అమ్మగారి చుట్టూ చేరాం. అమ్మగారు “ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం” అన్నారు. హిమాలయ పర్వత ప్రాంతంలోని అత్యంత సుందరమైన ప్రదేశం, అమ్మగారికి అంత చేరువగా ధ్యానం చేసే భాగ్యం…..మదిలో ఎదో తెలియని ఆనందం, తృప్తి… ముద్ర పెట్టి ఓంకారాలు ప్రారంభించాం….

Share.
Leave A Reply