Welcome to the BLISSFUL journey

Day 8 – అమ్మగారి విశ్వ కార్యంలో శిష్యులకు భాగస్వామ్యం

0

అమ్మగారు ఒక అరగంటలో తయారై, మరుసటి రోజు జరగబోయే దీక్షా కార్యక్రమ ప్రణాళికను చర్చించేందుకు అందరినీ రమ్మన్నారు. ధ్యాన శిబిరాలు నిర్వహించేటప్పుడు అమ్మగారే స్వయంగా అందరికీ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రతీ విషయాన్ని అత్యంత సూక్ష్మంగా వివరించి 100% నైపుణ్యంతో, భావంతో చెయ్యమని శిష్యులకు చెబుతారు అమ్మగారు. భావం లేకుండా, పూర్తి దృష్టి లేకుండా గురువులు అప్పగించిన పనిని చెయ్యాలనుకోవటం కత్తితో చెలగాటం ఆడటం వంటిది. తెలిసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు అలసత్వం కారణంగాజరిగినప్పుడు పెద్ద ఇబ్బందులే ఎదుర్కొన్న అనుభవాలు మా బృందంలో అందరికీ ఉన్నాయి. గురువులు మనకి అప్పగించే పనులు వారే స్వయంగా జరిపించుకోలేక కాదు, శిష్యుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే చిన్న చిన్న పనులు అప్పగిస్తుంటారు. ఆ పనిలోనే శిష్యుల ఆధ్యాత్మిక పరిణతిని గ్రహించ గలుగుతారు గురువులు. అందుకే అందరం గురువులిచ్చిన పనిని భావంతో నిర్వర్తించాలని శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఆధ్యాత్మికంగా భగవద్ సాంగత్యాన్ని పొందిన గురువుల సమక్షంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ విషయాలుఅమ్మగారు ఏ రోజు ఆదేశాలుగా చెప్పలేదు. కానీ కొన్ని అనుభవాలే గుణ పాఠాలు నేర్పాయి. పరమాత్మతో సమానమైన గురువులు ఏ పనినైనా ఎంతో సులువుగా జరిపించుకోగలరు. కానీ శిష్యుల కర్మల క్షయం కోసం, శిష్యులకు ఉన్నత గతులను ప్రసాదించటం కోసం వారి విశ్వ కార్యంలో మమల్ని సైతం భాగస్వాములను చేశారు అమ్మగారు. గీతలో శ్రీ కృష్ణుడు బోధించినట్లు, ప్రతిఫలాపేక్ష లేకుండా మన ధర్మాన్ని గురువు నిర్దేశంలో నిర్వహించగలిగితే, అది తప్పక మన ఆధ్యాత్మిక పురోగతికి కారణం అవుతుంది. ఇలా ఉండటమే మంచిశిష్యుల లక్షణం కూడా.

Share.
Leave A Reply