మేము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. సరిగ్గా ఉదయం 6 గంటలకల్లా విమానాశ్రయంలో ఉండాలని చెప్పారు.మా బృందంలో అందరి హృదయాల్లో నిండిన ఆనందం మా ముఖాల్లో కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. మా బృందంలోని కొందరు హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరాం, మరి కొందరు వేరే నగరాల నుండి బయలుదేరారు. ఈ మహదావకాశాన్ని కైవసం చేసుకోవటం కోసం, ఎన్ని జన్మలెత్తామో! ఇంకెన్ని నోములు నోచామో! ఇన్నాళ్లకు మా కల నెరవేరింది. పొంగి ప్రవహిస్తున్న గంగా ప్రవాహంలా మా హృదయాలు ఆనందంతో ఉరకలు వేస్తున్నాయి. ‘పునరపి జననం, పునరపి మరణం’ అనే సంసార పంజరంలో నిర్బంధింపబడిన విహంగాలకు స్వేచ్ఛ కలిగి విశాల ఆకాశంలో ఎగిరిపోతుంటే కలిగిన అనుభూతి మాకు కలిగింది. అందరిలోనూ ఇదే భావన… “ఈ జన్మకు ఉద్ధరించే గురువు దొరకటం ఒక ఎత్తైతే, ఈ ఆధునిక యుగంలో కూడా అనేక ఆధ్యాత్మిక అనుభవాల్ని అందించే హిమాలయ యాత్రకు అర్హతను సాధించటం మరొక గొప్ప అవకాశం” ఇదే విషయాన్ని పదే పదే పునశ్చరణ చేసుకుంటూ అమితమైన ఆనందోత్సాహాలతో సంతోషంగా ఫ్లైట్ ఎక్కాం…..